టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి కంటి సమస్యలకు చికిత్స అవసరమంటూ వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం చంద్రబాబును పరీక్షించిన వైద్యులు నివేదిక ఇచ్చారని, అందులో ఆయన కంటికి చికిత్స అవసరమని పేర్కొన్నారని తెలిపారు. అయితే, జైలు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని వైద్యులు చెబితే.. ఆ నివేదికను మార్చి ఇవ్వాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ వివరణ ఇస్తూ.. చంద్రబాబు నాలుగు నెలల క్రితం ఓ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు.. రెండో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారని వివరించారు.