తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్న వేళ జనసేన పోటీ చేయబోయే స్థానాలపై తెలంగాణాలో ఆసక్తి నెలకొంది. రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నవేళ మల్కాజ్‌గిరి నుంచి జనసేన అభ్యర్థిని బరిలో నిలపబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పొత్తుపై ఇంకా పూర్తి స్పష్టత రాకముందే మల్కాజ్‌గిరిపై కన్నేసినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పవన్ పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో ఇది కూడా ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జనసేనకే కేటాయించవచ్చని సదురు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ స్థానం నుంచి జనసేన ఒక కీలకమైన నేతను బరిలో నిలపబోతోందని తెలుస్తోంది. అయితే బీజేపీ తరపున ఈ స్థానాన్ని ఆశిస్తున్నవారి జాబితా పెద్దగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్‌, జీకే కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత జీకే హన్మంతరావు, మల్కాజిగిరి కార్పొరేటర్‌ ఉరపల్లి శ్రవణ్‌ బీజేపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందరూ ఢిల్లీ స్థాయిలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నప్పటికీ ఆకుల రాజేందర్‌, భానుప్రకాశ్‌ల మధ్య ప్రధానంగా పోటీ ఉందని వినికిడి. మరి ఇక్కడి నుంచి ఏ పార్టీ, ఎవరిని బరిలో నిలుపుతుందనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Previous articleకర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏపీ వలస కూలీల మరణంపై పవన్ కళ్యాణ్ స్పందన
Next articleచంద్రబాబు అరెస్టు సమయంలో అధికారుల కాల్ డేటా ఇవ్వాలని టీడీపీ పిటిషన్