జనసేన పార్టీ మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానమైన పాలకొండ నుంచి బరిలో దిగేందుకు ఆశావహులెందరో పోటీ పడ్డప్పటికీ పలుసార్లు సర్వే చేసి ఎక్కువ మంది మద్దతు లభించిన జయకృష్ణ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జనసేన పోటీచేసే మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీ పడటంతో జనసేన సర్వేలు నిర్వహించింది.ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించిందని పేర్కొన్నారు. ఇటీవలే టీడీపీని వీడిన నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. . మూడు పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ క్రమంలోనే జనసేన విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.