మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. ఇది ఏ స్వచ్చంద సంస్థకో కాదు. తన సోదరుడు పవన్ కల్యాణ్ నడిపిస్తున్న జనసేన పార్టీకి తన వంతు విరాళంగా ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు మెగాస్టార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయిన కారణంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే తన అన్న చిరంజీవి షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి పవన్ కళ్యాణ్ వెళ్లారు ఆ సమయంలోనే చిరంజీవి ఈ 5కోట్ల రూపాయల చెక్కును సోదరుడికి స్వయంగా అందజేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి చిరంజీవి ఎన్నికల నిర్వాహణ నిమిత్తం ఈ ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేసినట్లుగా తెలుస్తోంది. విశ్వంభర సినిమా సెట్ లో ఆంజనేయస్వామి విగ్రహం ముందు చిరంజీవి ఈ చెక్కును పవన్ కళ్యాణ్ కు అందజేశారు. అయితే అన్న చేతుల మీదుగా చెక్కును తీసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే ఆయనకు పాదాబివందనం చేసుకుని హత్తుకున్నారు. అనంతరం ముగ్గురు మెగా బ్రదర్స్ కాసేపు ముచ్చటించుకున్నారు. విశ్వంభర సినిమా షూటింగ్ పై పవన్ ఆరా తీయగా..జనసేన పార్టీ ప్రచారం, జరగబోయే ఎన్నికల గురించి చిరంజీవి మాట్లాడినట్టు సమాచారం. . ఇక చిరంజీవి ట్విట్టర్ లో విజయోస్తు అంటూ మెసేజ్ పెట్టి తమ్ముడిని ఆశీర్వదించారు. అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తామంటారు కానీ తన తమ్ముడు .అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం వినియోగించటం తనకు సంతోషాన్ని కలిగించిందని చిరంజీవి అన్నారు. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మంచి మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించానంటూ చిరు ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. చిరంజీవి తమ పార్టీకి 5కోట్ల విరాళం అందజేసినట్లుగా జనసేన పార్టీ అధికారికంగా ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ కు జనసేన నాయకులు, సైనికులు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ తో పాటు జనసేన సీనియర్ నేత, మరో సోదరుడు నాగబాబు, మరికొందరు జనసేన నేతలు మెగాస్టార్ ను కలిసేందుకు వెళ్లారు. మెగా బ్రదర్స్ ఈ విధంగా ఒక ఫ్రేమ్ లో కనిపించడంతో అటు సినిమా అభిమానులు, జనసైనికులు హ్యాపీగా ఫీలవుతున్నారు.