ఎన్నికలకు ముందు ఒక పార్టీలోంచి ఇంకో పార్టీ లోకి నేతలు జంప్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన కూతురు విజయలక్ష్మితో ఆయన కాంగ్రెస్లో చేరుతున్నట్టు గురువారం రాత్రి తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ప్రకటించారు. కేసీఆర్‌ తనకెంత గౌరవం ఉందో నాకూ ఆయన అంతే గౌరవం ఇచ్చారన్నారు. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తాను గతంలో పనిచేసిన తిరిగి కాంగ్రెస్‌లోకే తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. తనకు రాజకీయ జీవితం నేర్పిన కాంగ్రెస్ అంటే తనకు సొంతిల్లు లాంటిదని కేకే అన్నారు. తాను సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నానని, ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని కేకే అన్నారు. తాను రాజకీయ జీవితం ప్రారంభించింది కాంగ్రెస్‌లోనేనని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆశయ సాధన కోసం బీఆర్ఎస్‌లో చేరానని తెలిపారు . తాను ఆశించినట్టుగానే తెలంగాణ సిద్ధించిందని, కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ కోరికను నెరవేర్చిందని గుర్తు చేశారు. తాను 53 ఏళ్లపాటు కాంగ్రెస్‌ లో పనిచేస్తే కేవలం పదేళ్లే బీఆర్ఎస్‌లో పని చేశానని కేశవరావు అన్నారు . కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని తెలిపారు . ప్రస్తుతం తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని, బీఆర్ఎస్‌లో యువతకు మరిన్ని అవకాశాలు రావాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు. అయితే గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్‌తో కేకే భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో కేశవరావు పై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా మీడియా కథనాలు వెలువడ్డాయి.