టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో అల్లాడుతోన్న రైతాంగాన్ని త‌క్షణ‌మే ఆదుకోవాలని స్పష్టం చేశారు. నీరు లేక ఎండిన పంట‌లు చూస్తే గుండె త‌రుక్కుపోతోందని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మరో మార్గం లేక పంట‌ల్ని రైతులు త‌గ‌ల‌బెడుతుంటే క‌ళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని వెల్లడించారు. వ‌రి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటోన్న రైతుల్ని చూస్తే హృద‌యం ద్రవించిపోతోందని పేర్కొన్నారు. 

“నీరు వ‌దిలి పంట‌ల్ని కాపాడాలంటూ అధికారుల కాళ్లపై ప‌డి ప్రాధేయప‌డుతున్న అన్నదాత‌లు, సాగు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులే రాష్ట్రమంతా క‌నిపిస్తున్నారు.  ప్రభుత్వం త‌క్షణ‌మే స్పందించ‌క‌పోతే ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లేని రాష్ట్రం అయ్యే ప్రమాదం పొంచి వుంది. 

రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు ఎన్నడూ లేవు. తొలిసారి అతి తక్కువ వర్షపాతం మీ పాలనలో నమోదైంది. రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో  మీ ప్రభుత్వం విఫలమైంది.