టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఇటీవల పవన్ కు లేఖాస్త్రం సంధించడం తెలిసిందే.

అయితే… నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు… జనసేనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలా వ్యవస్థాగత బలం ఉందా? బూత్ లెవెల్ లో జనసేనకు బలం ఉందా? అంటూ పవన్ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో, హరిరామజోగయ్య జనసేనాని పవన్ కు మరోసారి లేఖ రాశారు. జనసేన క్షేమం కోరి నేను చేసిన సూచనలు, సలహాలు మీకు నచ్చినట్టు లేవని పేర్కొన్నారు.

“మొన్నటి సభలో నా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా… ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే నన్ను విమర్శించినట్టే అనిపించింది. నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ చెప్పాలి. నా అంచనా ప్రకారం జనసేనకు 40 స్థానాల్లో బలమైన అభ్యర్థులున్నారు. అలాంటప్పుడు 24 సీట్లే తీసుకోవడం ఎందుకని ప్రశ్నించాను… అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా? మీరు బాగుండాలన్న ఉద్దేశంతోనే బీజేపీని కూడా మీ కూటమిలోకి తీసుకోవాలని సూచించాను… అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా?” అంటూ హరిరామజోగయ్య ప్రశ్నాస్త్రాలు సంధించారు.