ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నమే రాజధాని అని అంటూ చివరకు గంజాయికి కాపిటల్ గా మార్చేశారని వైసీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజధానిని చేస్తామన్న నేతలు ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదేంటా అని మనం అనుకున్నాం. కానీ విశాఖను గంజాయి కాపిటల్ గా ఎప్పుడో మార్చేశారని చెప్పారు. ఈ విషయం మనమే అర్థం చేసుకోలేదన్నారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో, ఏమనుకోవాలో తెలియట్లేదని వాపోయారు.

మొన్నటికి మొన్న ఒకే ఒక్క కంటైనర్ లో వేల కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తలు మనమంతా చూశామని చెప్పారు. ఈ లక్షల కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సమాజంలోకి వస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.