పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం తెలిసిందే. రోడ్డుపై బైక్ నిలిపి ఉంచడంతో హారన్ కొట్టిన నేరానికి ఆ డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. 

వైసీపీ అరాచకానికి కావలి ఘటనే నిదర్శనమని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడంలేదని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, అందుకు అహంకారం కూడా తోడవడంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీద, ఉద్యోగుల మీద జులుం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన చూస్తే వైసీపీ అరాచకం ఏ విధంగా పెచ్చరిల్లుతోందో అర్థమవుతోందని తెలిపారు. “రోడ్డుకు అడ్డంగా ఉన్న మోటార్ సైకిల్ తీయమని హారన్ మోగించడమే ఆ ఆర్టీసీ డ్రైవర్ చేసిన నేరమా? ఆ బస్సును వెంబడించి మరీ విచక్షణ రహితంగా దాడి చేయడం, ఆ అరాచకాన్ని చిత్రీకరించిన వారిని బెదిరించడం చేశారంటే… అలాంటి గూండాలకు బలమైన అండ ఉండడమే కారణం అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.