తన తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటుడిగా నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తన స్పందన వెలిబుచ్చారు. “సినిమా రంగంలో ఎంతో అద్భుతమైన రీతిలో 45 వసంతాలను పూర్తి చేసుకున్న మన అభిమాన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాభినందనలు. నిజంగా ఎంత అద్వితీయమైన సినీ ప్రస్థానం! ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలై, ఇప్పటికీ తిరుగులేని నటనతో అంతకంతకు ఎదుగుతున్నారు. వెండితెరపై మీ చిత్రాల ద్వారా, సమాజంలో మీ సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావం, అత్యున్నత పనితీరు, వీటన్నింటికి మంచి కరుణ తదితర విలువలను నింపినందుకు… థాంక్యూ నాన్నా!” అంటూ రామ్ చరణ్ ఎక్స్ లో స్పందించారు.