మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా చూడట్లేదని అన్నారు. భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. శామీర్ పేట్ మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాత్రికిరాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మండిపడ్డారు.

తన అనుచరులతో కలిసి మల్లారెడ్డి ఈ దందా చేశారని కేశవాపురం గ్రామస్థులు చెప్పారు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మంది, తహసీల్దార్ పై కేసు నమోదు చేశారని వివరించారు. మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి అనుచరులపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు.