సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. రేపు డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు. 

తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆసుపత్రిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కేసీఆర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.