కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్న తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. అర్హత కలిగిన లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియను గ్రామాల్లో గ్రామసభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా చేపట్టాలని భావిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని పరిశీలించనున్నారు. మీ-సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

 మరోవైపు రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో సవరణలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సవరణలకు సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చేందుకు 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ జరగలేదన్న విషయం తెలిసిందే.