వరంగల్ లోక్ సభ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత పసునూరి దయాకర్ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.

వరంగల్ లోక్ సభ సీటు కేటాయింపు విషయంలో పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దయాకర్ వరంగల్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2015 లోక్ సభ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించారు. కానీ వరంగల్ సీటును ఈసారి కడియం కావ్యకు కేటాయించడంపై దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.