బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ను విష్ చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్ కేటీఆర్ పట్ల తన అభిమానాన్ని మరోలా చాటుకున్నారు. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హమ్‌లో ఓ చాపర్ ద్వారా విష్ చేశారు. కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీని వేలాడదీసి ఆకాశంలో ప్రదర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్.. భారీ బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ సాధించిన విజయాలను ఫొటోలతో వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీ హబ్, దుర్గం చెరువు ఫ్లై ఓవర్, టీ వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్ల చిత్రాలను ఇందులో పొందుపరిచారు. ఈ వాహనం నేటి నుంచి పది రోజులపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సంచరించనుంది. తమ నేత ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.
