జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఈ మేరకు అధిష్ఠానం నుంచి ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. నిడదవోలు సీటు నుంచి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, ప్రతి ఒక్కరూ తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు నియోజకవర్గంలోని వీరవరంలో సోమవారం ఆ పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ- జనసేన పొత్తు ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నానని, అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. వ్యూహ, ప్రతివ్యూహాలను పార్టీ పెద్దలకు వదిలి వేసి తాను ఎన్నికల బరిలో నిలవబోతున్నానని చెప్పారు. వెన్నంటే ఉంటూ రాజకీయ ఎదుగుదలకు తనకు దోహదపడిన జనసేన కేడర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక సేవలతో పాటు ఇతర కార్యక్రమాల్లో ఈ ప్రాంత యువత తనపై చూపించిన అభిమానం మరువలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక ప్రభత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీ-జనసేన పొత్తు విజయవంతమవ్వాలని ఆయన ఆకాంక్షించారు. కలిసికట్టుగా పనిచేస్తామంటూ ఈ సందర్భంగా కందుల దుర్గేశ్‌కు జనసేన కేడర్ హామీ ఇచ్చింది.