ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె ప్రసంగిస్తూ… ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తానని తన సంకల్పాన్ని ప్రకటించారు. తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఇదే పీసీసీ పదవిని చేపట్టారని, రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారని వెల్లడించారు. ఇప్పుడదే పదవిని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను చేపడుతున్నానని తెలిపారు. నన్ను నమ్మి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ షర్మిల పేర్కొన్నారు. తాను ఈ పదవి చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అభిమానులు కోరుకున్నారని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.