తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి , బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకరి పై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే
రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్ల మీద ఒట్టు వేసి చెబుతున్నారని, ఒకవేళ చేయకపోతే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని… రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి సవాల్ చేశారు. ఆరు గ్యారెంటీలు సహా అన్ని హామీలు నెరవేరిస్తే కనుక తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు.నల్గొండ జిల్లా పరిధిలోని చుండూరులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగ‌లు, కాంట్రాక్ట‌ర్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో అస‌లైన కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌న్నారు. భువనగిరి పార్లమెంట్‌లో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తొమ్మిది రోజులు కష్టపడితే రానున్న అయిదేళ్లు మీ తరఫున కొట్లాడుతామన్నారు. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చేయలేదన్నారు. మొదటి హామీగా మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పి కూడా నాలుగు నెలలు గడిచినా నెరవేర్చలేదని హరీష్ రావు అన్నారు. రెండో హామీగా రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు . బీఆర్ఎస్ పార్టీ కరోనా కష్ట కాలంలో ఉద్యోగుల జీతాలు బంద్ పెట్టి రైతులను ఆదుకుందని హరీష్ రావు అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌కు ఓటేయ్యాలా.. ? ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం పడిపోదని… పథకాల అమలుకు బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు చెప్పారు.