హార్స్ పవర్ అంటే తెలియని వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్ కుమార్ తరఫున కోహెడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికలు రాగానే మళ్లీ బయలుదేరారని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. కరోనా వచ్చినప్పుడు ప్రజలతో ఉన్నది బీఆర్ఎస్సే అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలు అక్కడి ప్రజల వలె ఆగం కావొద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమో కానీ… ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారడం మాత్రం ఖాయమని విమర్శించారు. మూడు గంటల కరెంట్‌తో మూడు ఎకరాలకు నీరు పారుతుందని రేవంత్ రెడ్డి, రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే అంతే సంగతులు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో వంద రెట్లు బాగుందన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ఉపన్యాసాలతో ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చాక అక్కడ ఏం చేయలేక అటు వైపు వెళ్లడమే మానుకున్నారని ఎద్దేవా చేశారు. వారు చెబుతున్న ఆరు గ్యారెంటీలు అమలయ్యేవి కాదన్నారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచాక జనవరి నుంచి రేషన్ దుకాణాలలో సోనామసూరి బియ్యం ఇస్తామన్నారు.