తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నేతలు క్యూ కడుతున్నారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, తన సహోద్యోగులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బొకే ఇచ్చి రేవంత్ కు అభినందనలు తెలిపారు. రేవంత్ ను కలిసిన వారిలో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉదయం పది గంటల నుంచే రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు. కార్యకర్తల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. కాగా, రేవంత్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం మామూలుగా లేదు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆస్వాదిస్తున్నారు.