ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్వీకరించిన వైఎస్ షర్మిలపై అప్పుడే ఎదురుదాడి మొదలయింది. ఆమె వ్యక్తిగత విషయాలపై కూడా వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇంటి పేరును మారుస్తూ ఆమెను సంబోధిస్తున్నారు. మొరుసుపల్లి షర్మిల అని పేర్కొంటున్నారు. సీఎం జగన్ కు, వైసీపీకి అనుకూలుడైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎక్స్ వేదికగా వివాదాన్ని మరింత పెంచేలా ప్రశ్న వేశారు. ఆమెను మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని ఎందుకు పిలుస్తున్నారో తనకు ఎవరైనా చెప్పాలని ఆయన అడిగారు. నిన్న అర్ధరాత్రి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది ఈ ట్వీట్ ను వీక్షించారు. మరోవైపు, వైసీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్ కూడా షర్మిలను… మొరుసుపల్లి షర్మిలగా పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ ట్వీట్ లో మొరుసుపల్లి షర్మిల అనే హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేశారు.  

షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. ఆయన ఇంటిపేరు మొరుసుపల్లి. ఆయన క్రైస్తవ మతంలోకి మారారు. క్రైస్తవ మతబోధకుడిగా ఆయన ప్రఖ్యాతిగాంచారు.