కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.బిజెపి అనుకున్న లక్ష్యానికి దగ్గరగా కాకుండా దూరంగా జరుగుతోంది.వ్యూహాత్మకంగా ఎన్నికలకు పని చేయాల్సిన చోట బీజేపీ నేతలు అది పక్కన పెట్టి పదవులకోసం కొట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్తులో బీజేపీ విజయం సాధిస్తే సీఎం తామేనని చెప్పుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలతో బీజేపీలోని క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింది.రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి 33 మంది నాయకులు చేరడంతో బీజేపీకి అది గట్టి షాక్ ఇచ్చినట్టు అయింది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నాయకులు కూడా పార్టీలోకి తీసుకు రాలేకపోయిన తెలంగాణ బీజేపీ నాయకుల అసమర్థతపై బిజెపి అధినాయకత్వం గుర్రుగా ఉంది.

ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని భయపడిన సీఎం కేసీఆర్, ప్రస్తుతం బీజేపీ విషయంలో బిందాస్ గా ఉన్నారు. అంతర్గత గొడవలతో బిజెపి నాయకులు వచ్చే ఎన్నికల పై ఫోకస్ చేయలేరని ధీమాతో ఉన్నారు.అందుకే ఇటీవల కాలంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప బిజెపి వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బిజెపిని బీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు.