ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(శిరీష) పేరు మార్మోగింది. అలాగని ఆమె రాజకీయ నేత కాదు… ఓ యూట్యూబ్ వీడియోతో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకుని, బర్రెలక్కగా ఫేమస్ అయింది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సంచలనం సృష్టించింది. తాను నిరుద్యోగుల ప్రతినిధినంటూ ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల్లో బర్రెలక్క ఓటమిపాలైనప్పటికీ, ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఇక అసలు విషయానికొస్తే… అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క తగ్గేదే లే అంటోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని సమరోత్సాహం ప్రదర్శిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన బర్రెలక్క… లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించింది. 

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు తనను మరింత దృఢంగా మార్చాయని పేర్కొంది. ఓటుకు నోటు అనే విధానాన్ని రూపు మాపడంపై కృషి చేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని బర్రెలక్క చెప్పింది.