గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించిన పవన్.. తాము అధికారంలోకి వస్తే ఈ జిల్లాల్ని ఎలా అభివృద్ధి చేస్తామో ట్వీట్ లో వెల్లడించారు. ఇందులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, పంచారామాలకు నెలవైన గోదావరి జిల్లాల్ని ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని పవన్ తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ మ్యాప్ ను కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇందులో కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం వరకూ పలు పుణ్యక్షేత్రాలున్నాయి.
అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయం నుంచి భీమవరం శ్రీ సోమేశ్వరాలయం వరకూ ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయని పవన్ తెలిపారు. వేదఘోషతో పరవశించే ఉభయ గోదావరి జిల్లాల్ని ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు.
శక్తి పీఠాలు కొలువైన పిఠాపురం, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలైన సామర్లకోట, పాలకొల్లు, నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది, ర్యాలీ జగన్మోహిని స్వామి క్షేత్రం, అయినవిల్లి వినాయక ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన వాడపల్లి, ద్వారకాతిరుమల క్షేత్రాలు, నరసాపురం శ్రీ ఎంటెరు మన్నారు స్వామి ఆలయం.. ఇలా ఒకటేమిటి ఎన్నో దివ్యక్షేత్రాలతో గోదావరి సీమ అలరారుతోందని పవన్ తెలిపారు.
