ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ… గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరినట్లు చెప్పారు. తెలుగు సహా వివిధ భాషల్లో ఆమె ఎన్నో సినిమాలు చేశారని, ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. ఆమెకు ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయన్నారు. సినీ పరిశ్రమలో ఆమెకు మంచి పేరు ఉందన్నారు. 2009 నుండి 2014 వరకు ఆమె ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారన్నారు.  కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జయసుధ బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి, దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటించారన్నారు. ఆమె రాక బీజేపీకి లాభమని, బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి కోసం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృషి చేశారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని యావత్ తెలంగాణ కోరుకుంటోందన్నారు.

Previous articleఎన్డీయే, ఇండియా కూటమిలపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Next article3-8-2023 TO DAY E-PAPER