వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటములు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉంది. తాజాగా ఈ కూటములపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేసీఆర్… అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ.. తాము ఏ కూటమిలో కూడా లేమని స్పష్టం చేశారు. ఆ కూటముల్లో చేరాల్సిన అవసరం కూడా తమకు లేదని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో అధికారంలో ఉన్నవారే ఆయా కూటముల్లో ఉన్నారని… దేశంలో వారు తీసుకొచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు. 

భారత్ లో సరికొత్త మార్పు రావాల్సిన అవసరం ఉందని… అది ఈ రెండు కూటముల వల్ల సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. అందుకే ఆ కూటముల్లో తాము చేరలేదని చెప్పారు. అలాగని బీఆర్ఎస్ ఒంటరిగా లేదని… తమతో కలిసి నడిచే పార్టీలు కూడా ఉన్నాయని తెలిపారు.