‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని, బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తు అయ్యాయని అన్నారు.  రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయించారని రేవంత్ మండిపడ్డారు. అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయించారని, ఇవి దుర్మార్గపు చర్యలని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నిర్ణయంతో చట్టం, న్యాయంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని రేవంత్ అన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీకి అండగా నిలిచారని అన్నారు.