ఏపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు పెట్టడం బుద్ధి లేని, నీతిమాలిన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయింది అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలని హితవు పలికారు.నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు… ఆ సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం అని చంద్రబాబు విమర్శించారు. కేసు పెట్టాల్సి వస్తే, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడం పెద్ద జోక్ అని, నాలుగేళ్ల మీ దిక్కుమాలిన పానలలో పరువు ప్రతిష్ఠ ఎప్పుడో మంటగలిశాయని ఎద్దేవా చేశారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతక ఎలా నొక్కాలన్న అరాచకపు ఆలోచనలు పక్కనపెట్టాలని, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు.ప్రశ్నించినవారిపై కేసులు పెట్టి, వ్యక్తిగత దాడులు చేసినంత మాత్రాన మీ ప్రభుత్వ పాపాలు దాగవు… ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి అని సవాల్ విసిరారు.

Previous articleబీజేపీ అగ్ర నేతలతో పవన్ వరుస సమావేశాలు
Next articleజనసేన పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు