ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటం.. కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. మూడు పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండటమే దీనికి కారణం. అన్ని పార్టీల నాయకులు టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ తనకే ఇవ్వాలని కోరుతూ… జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ నిరాహారదీక్షకు దిగారు. విజయవాడలో తన మద్దతుదారులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. 

నిరాహారదీక్ష సందర్భంగా పోతిన మహేశ్ మాట్లాడుతూ… కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ ను తనకు అప్పగించడమే న్యాయమని అన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పని చేశానని చెప్పారు. తనతో పాటు జనసేన శ్రేణులు, అభిమానులు కూడా కష్టపడ్డారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి అణువు తనకు తెలుసని అన్నారు. 

తమ పోరాటం వల్లే ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గానికి పంపించారని పోతిన తెలిపారు. ఇక్కడ జనసేన తప్ప వేరే పార్టీకి టికెట్ ఇస్తే… వైసీపీపై గెలవడం సాధ్యం కాదని అన్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ తనకు టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. రెండవ జాబితాలో తన పేరు ఉంటుందని పవన్ చెప్పడం వల్లే తన దూకుడును పెంచానని తెలిపారు.