నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేని ప్రాంతం అది .. అయినా ఎవరికీ లెక్కలేనితనం.. భవిష్యత్‌ తరాల వారి జీవితాలు ఆగమవుతున్నా వాళ్లకు పట్టింపులేదు.. అమీన్ పూర్ పరిసర ప్రాంతాల్లో భూ అక్రమ దారులు ప్రీ లాంచ్‌ అనే పదంతో అందమైన ఊహా లోకాన్ని సృష్టిస్తున్నారు .. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు .. అమాయకులకు వలవేస్తున్నారు .. అక్కడ అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు పూటకొకటి పుట్టుకొస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు .. అవినీతికి ఆలవాలమైన ప్రభుత్వ అధికారులను సహితం కాసులతో కొనేస్తున్నారు .. అనుమతుల పేరుతో మాయ చేస్తూ.. ప్రమాదకర పరిస్థితుల్లో భారీ నిర్మాణాలు చేస్తున్నారు .. చెరువులను, తూములను, కనుమరుగు చేస్తూ.. గ్రీన్‌ బెల్ట్‌, బఫర్‌ జోన్లలో సెల్లార్లతో కూడిన భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్నారు .. చట్టాలకు, నియమ నిబంధనలకు రియల్ బాబులు సవాల్‌ విసురుతున్నారు.. భవిష్యత్తులో ఎదురయ్యే భయంకర ప్రమాదాలను సైతం చూడకుండా.. ప్రజల ప్రాణాలతో నిస్సిగ్గుగా ఆడుకుంటున్నారు.. అధికార ప్రభుత్వ నియంత్రణ కరువవడంతో అక్రమ ముష్కరుల అవినీతి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.. అమీన్‌పూర్‌లో ఎక్కడ ప్రభుత్వ భూమి కన్పిస్తే అక్కడ కబ్జా మొదలై రియల్ దందా స్టార్ట్ అవుతుంది. అడ్డొచ్చిన వారికి డబ్బులిచ్చి నోరు మూయటం , వినకపోతే స్థానిక నేతల సాయంతో బెదిరించడం ఇలా రియల్‌ వ్యాపారుల అక్రమ దందా అమీన్ పూర్ లో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది .అయితే గత ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు విడిచిపెట్టడంతోనే ఈ దందా ఇంతవరకు సజావుగా సాగిందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక అక్కడ రియల్‌ వ్యాపారుల పై కొరడా జులిపించటానికి రంగం సిద్ధమైంది. అమీన్ పూర్ భూ ఆక్రమణపై సర్కార్ సీరియస్ గా ఉంది. సర్వే నెంబర్ 343 పై విచారణ మొదలు పెట్టింది. వందకు పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించి మంత్రి దామోదర ఆదేశాలతో కలెక్టర్ క్రాంతో రంగంలోకి దిగారు. భూ కబ్జాలపై లోతుగా సర్వే చేయాలనీ రేవంత్ ప్రభుత్వం ఆదేశించటంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. మరో పక్క ఇండ్ల కొనుగోలు దారులు ఆందోళనలో ఉన్నారు. ఇక గతంలో జరిగిన సర్వే లో సర్వే నెంబర్ 343లో 6.18 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ ల్యాండ్ లో కృష్ణ బృందావన్ కాలనీ పేరుతో వందకు పైగా అక్రమంగా ఇండ్లు నిర్మించినట్టు తేలింది. అప్పట్లోనే ఈ వెంచర్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే బి ఆర్ ఎస్ హయాంలో అది సద్దు మణిగినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఈ ప్రాంతాన్ని అధికారులు సర్వే చేసి రిపోర్ట్స్ ను జిల్లా కలెక్టర్ క్రాంతి కి అందజేయగా ఆయన పరిశీలిస్తూన్నారు. విచారణ పూర్తి చేసి ఇక్కడ అక్రమంగా జరిగిన ఇళ్ల నిర్మాణాల కూల్చివేత దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు అమాయకులను మోసం చేసిన నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. ఇక అమీన్‌పూర్‌ మున్సిపాల్టీలోని పటేల్‌గూడ గ్రామపంచాయతీలోనూ రోజురోజూకీ ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. అమీన్‌పూర్‌ మున్సిపాల్టీ లో ని నాళాలన, చెరువులను కూడా పూడ్చేసి అక్రమార్కులు వెంచర్లు చేశారు. అందులో ఎఫ్‌టీఎల్‌ పరిధిని దాటేసి ఎకరాలకు ఎకరాలే వెంచర్లు చేశారు. కొన్నిచోట్ల నాళాలను సైతం దారి మళ్లించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. మురుగు నీరు వెళ్లేందుకు ఉన్న నాళా రోజురోజూకీ కుచించుకుపోతుంది. నాళాను రెండు వైపులా దగ్గరికి మట్టితో చదును చేస్తూ నిర్మాణాలు చేస్తున్నా గత ప్రభుత్వంలోని అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బంధం కొమ్ము చెరువులోని సర్వే నెంబర్లు 360, 361, 362, 363,364,365, 367, 368, 369, 371, 372, 373, 374, 375, 376, ,377, 380,381, 390, 391, లో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు అమీన్‌ పూర్‌ లో సర్వే నెంబర్ 343, 343/5, 343/7 లో కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సర్వే నెంబర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల్లో స్థానిక నేతల హస్తం ఉండడంతో అప్పట్లో అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదని విమర్శలు వచ్చాయి. ఇక అక్రమ నిర్మాణాలను అధికారులు ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదు. లంచాలకు అలవాటు పడో.. లేక మరేదైనా కారణమో తెలియదు కానీ కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమీన్‌పూర్‌లో ఈ పరిస్థితి నెలకొంది. కలెక్టర్‌ ఆదేశాలతో ఇంతకుముందు రెండు సార్లు కూల్చివేతలు జరిపారు. నిజానికి అక్రమ ప్రభుత్వ భూముల కబ్జా, నిర్మాణాలు , చెరువుల ఆక్రమణల వ్యవహారం కలెక్టర్‌ సీరియస్‌గానే తీసుకుంటున్నారు . క్షేత్రస్థాయి అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తే ఈ అక్రమ కబ్జాలకు ఆస్కారం ఉండేది కాదని కొంతమంది వాదన. ఏదిఏమైనా అక్రమార్కుల చెర నుంచి అమీన్‌పూర్‌కు కొత్త ప్రభుత్వంలోనైనా విముక్తి కలుగుతుందని అక్కడి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.