బీసీ కులాలను కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను చులకన చేస్తే ఊరుకోబోమని అన్నారు. బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని చెప్పారు. బీసీ నేతలపై బాడీ షేమింగ్ కు కూడా పాల్పడుతున్నారని విమర్శించారు. తాము తెగిస్తే దేనికీ భయపడమని అన్నారు. రాబోయే రోజుల్లో తామంటే ఏమిటో చూపిస్తామని తెలిపారు. పద్ధతిగా ఉండాలనే తాము ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని చెప్పారు. అన్ని బీసీ కులాలని పిలిపించి మాట్లాడుతామని తెలిపారు. బీసీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే లబ్ధి కలుగుతుందని మీరు భావిస్తే అది మీ ఖర్మ అని తలసాని చెప్పారు. బీసీల సమస్యలన్నీ తమకు తెలుసని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో బీసీలతో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలని… లేకపోతే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని హెచ్చరించారు.