ఎన్డీయే వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలుస్తుందని, అదే సమయంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ది అశోక్ హోటల్‌లో జరిగిన ఎన్డీయే సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. NDA అంటే న్యూ ఇండియా, డెవలప్‌మెంట్, ఆస్పిరేషన్ అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ఓటు షేర్ 50 శాతాన్ని దాటాలన్నారు. ఎన్డీయే అంటే ప్రజల కోసం పని చేసే కూటమి అన్నారు. దేశం, దేశ భద్రత, అభివృద్ధి, సాధికారత.. ఇవే ఎన్డీయే ప్రాథమిక ప్రాధాన్యతా అంశాలు అన్నారు.మనం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోను సానుకూల రాజకీయాలు చేశామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మనం ఎప్పుడు కూడా విదేశీ శక్తుల సహకారం తీసుకోలేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డుపడలేదని, అడ్డంకిగా మారలేదన్నారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ శత్రుత్వం ఉండరాదన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం నిత్యం తనను తిట్టేందుకే శక్తిని ఉపయోగిస్తోందన్నారు.తాము రాజకీయాలకు అతీతంగా దేశం కోసం చూస్తామన్నారు. ఎన్డీయే హయాంలోనే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రదానం జరిగిందన్నారు. శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, గులాం నబీ ఆజాద్, ముజఫర్ బేగ్ తదితరులకు పద్మ అవార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ నేతలు అందరూ బీజేపీతో లేదా ఎన్డీయేలో లేరని, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన అవినీతిని, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చామని, కానీ ప్రజాభిప్రాయాన్ని ఎప్పుడూ అగౌరవపరచలేదన్నారు.ఎన్డీయే ఏర్పాటై పాతిక సంవత్సరాలు గడిచిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ నినాదంతోనే ఎన్డీయే ముందుకు సాగిందన్నారు. ఎన్డీయేతో కలిసి వచ్చిన ప్రతి పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీయే కీలక భూమిక పోషించిందని, మిత్రపక్షాలు కూడా వివిధ రకాలుగా ఎన్డీయేకు మద్దతిచ్చాయన్నారు. 2014, 2019లలో బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ కూటమిలోని పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చినప్పుడు, భవిష్యత్తు తరాలకు భద్రత కల్పిస్తామని, ఎన్‌డీఏ పథకాలు పేదరికం అనే దుర్మార్గపు చక్రాన్ని ఛేదించాయన్నారు. తాను మధ్యప్రదేశ్ లోని గిరిజన గ్రామానికి వెళ్లి గిరిజన మహిళలను కలిశానని, అప్పుడు వారు తనతో ఓ మాట చెప్పారని.. స్వయం సహాయక బృందాల సహాయంతో లక్షాధికారి అయినట్లు చెప్పారన్నారు. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు పోటీ పడతారని, బెంగళూరులో ఒకరినొకరు కౌగిలించుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రతికూలతతో నిర్మించబడిన పొత్తులు ఎన్నడూ గెలుపును ఇవ్వవని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష కూటమి I-N-D-I-A పేరు పలకకుండా.. ఒక కూటమిలోని వారంతా వంశపారంపర్యంగా, అవినీతితో ఉంటే దేశం నష్టపోతుందని హెచ్చరించారు. ప్రతిపక్షాలు I-N-D-I-A అంటే ప్రధాని మోదీ భారత్ అంటూ కౌంటర్ ఇచ్చారు. విపక్ష I-N-D-I-A కూటమిని భారత్ ఓడిస్తుందన్నారు.