ఎన్డీయే సమావేశానికి హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం జరగనున్న ఈ భేటీకి 38 పార్టీలు హాజరు కానున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి జనసేనానికి ఆహ్వానం అందింది. ఆయన కూడా బీజేపీతో పొత్తు కోసం సిద్ధంగా ఉన్నారు. జనసేనాని ఢిల్లీలో మాట్లాడుతూ… ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.

2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. ఆ సమయంలో కలిశానని, 2019లో వేర్వేరుగా పోటీ చేశామని గుర్తు చేశారు. మంగళవారం నాటి భేటీ కోసం బీజేపీ సీనియర్ నాయకులు తనను ఆహ్వానించారని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై ఈ భేటీలో చర్చిస్తామన్నారు. ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలనే అంశంపైనా చర్చిస్తామన్నారు.