బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా… బీసీ అంటే బలహీనవర్గం కాదు… బలమైన వర్గం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేశ్ ప్రసంగించారు. రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి, పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని వివరించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. “బీసీల కోసం ఏకంగా మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా టీడీపీ తీర్మానం చేసింది. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఆనాడు బీసీలే వెన్నెముక అన్న వ్యక్తి ఇవాళ బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందికి పదవులు దూరం చేశాడు. ఇవాళ బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను వెనక్కి తీసుకున్నారు. ఆదరణ పథకం కూడా రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కోసం బీసీ సోదరులు 10 శాతం డబ్బు కడితే, ఆ డబ్బు నేడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు… కానీ ఆ కార్పొరేషన్ల చైర్మన్లకు కుర్చీలు కానీ, టేబుళ్లు కానీ ఉన్నాయా? రూ.75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు తప్పుదారి పట్టించారు.