ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం నేడు రాష్ట్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ ను కలిసింది. ఓట్ల నమోదు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు, తదితర టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో తాము చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎన్నికల ప్రధాన కమిషనర్ ను అడిగారు. 

అనంతరం, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎనిమిది జిల్లాల కలెక్టర్ల తీరు చూస్తుంటే, వారు జిల్లా కలెక్టర్లా లేక వైసీపీ కార్యకర్తలా అనే సందేహం వస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. వారిపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మీరు చేస్తున్న తప్పిదాలు రికార్డు అవుతున్నాయి… ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.