హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీకి రేవంత్ రెడ్డి జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రశ్న లేదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. అధికారులు లేదా సంస్థ పనితీరుపై అపోహలు మరియు రాజకీయ ఉద్దేశ్యాలను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అధికారుల పేర్లను రేవంత్ రెడ్డి పేర్కొనడంపై హెచ్ఎండిఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వానికి లోబడి, ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ పనిచేస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి మరువరాదని, పునరుద్ఘాటించారు. అధికారులు మరియు సంబంధిత విభాగాలు నిబంధనల ప్రకారం తమ విధులను నిర్వహిస్తున్నారని హెచ్ఎండిఏ తెలిపింది. మంత్రి మండలి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హెచ్ఎండిఏ పని చేస్తుందని వివరించింది. NHAI యొక్క TOT బిడ్ కోసం నిర్దేశించిన నిబంధనలను అనుసరించి, ORR TOT యొక్క బిడ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్ఎండిఏ పునరుద్ఘాటించింది. 30 సంవత్సరాలకు TOT బిడ్ అనేది మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా ఉందని, NHAI యొక్క రెండు బిడ్లు 30 సంవత్సరాల కాలానికి ఖరారు అయ్యాయని, TOT చేయడం ఇదే మొదటిసారి కాదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. బిడ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరూ తమ పనిని పారదర్శకంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి నిర్వహించారని హెచ్ఎండిఏ పునరుద్ఘాటించింది. రేవంత్ రెడ్డి RTI ప్రశ్నకు ప్రత్యుత్తరం అతనికి నిర్ణీత గడువులోగా సమర్పించబడిందని, ORR TOT బిడ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని నిలిపివేయడం అనే ప్రశ్నే లేదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. హెచ్ఎండిఏ తన అధికారిక విధులను నిర్వర్తించడంలో బెదిరింపులకు గురికావడానికి లేదా భ్రమింపజేయడానికి వీలులేదని, అవసరమైన చట్టపరమైన చర్యల ద్వారా తనను మరియు తన అధికారులను రక్షించుకోవడానికి హెచ్ఎండిఏ అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని స్పష్టం చేసింది.