తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ ఇవ్వగా.. ఇటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లారు. రెండు రోజుల పర్యటన కోసం నిన్న ఉదయమే ఆయన ఆకస్మికంగా బయల్దేరడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌తో భేటీ అయ్యేందుకే బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది.  ఓవైపు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మలను పార్టీలోకి రావాలంటూ రేవంత్‌తో పాటు పొంగులేని శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. రేపు గాంధీభవన్‌లో పీఈసీ సమావేశం జరగనుంది.  ఆ తర్వాత ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ బెంగళూరు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసిన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో డీకే శివకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ బెంగళూరు టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.