రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ లా ప్రధాని నరేంద్ర మోదీ చెవిలో తాను గుసగుసలు చెప్పలేదని… తనది అంతా బహిరంగమే అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో తన సోదరుడు మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ప్రచారం సాగిందనీ, అయితే అది అవాస్తవమనీ, తమ్ముడు పోటీ చేయడం లేదని స్పష్టతనిచ్చారు. అలాగే మోదీని పెద్దన్నగా పేర్కొనడంపై బీఆర్ఎస్ టార్గెట్ చేయడంపై స్పందిస్తూ.. తనది అంతా బహిరంగమే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగినట్లు చెప్పారు. జీఏస్టీ ఆదాయం రూ.500 కోట్లు పెరిగిందన్నారు. ఎల్‌ఆర్ఎస్‌పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామన్నారు. సీఏంఆర్ఎఫ్‌పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందని… ఆ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. తమ పరిపాలనే రెఫరెండంగా లోక్ సభ ఎన్నికలకు వెళతామన్నారు. 17కు గాను 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ట్యాక్స్ పేయర్స్‌కు రైతుబంధు ఎందుకు? అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే వారికి మాత్రమే రైతుబంధు ఉండాలన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.