తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన పరామర్శించనున్నారు. రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కేసీఆర్ కాలు జారి పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగింది. ఆయనకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.