తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఏపీ రాజకీయాలపై పవన్ చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్ పాల్గొనడం, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలసి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.గతంలో చంద్రబాబు, పవన్ మూడు సార్లు సమావేశమయ్యారు. ఒకసారి విజయవాడ, రెండుసార్లు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ మీటింగ్‌ కీలకం కానుంది. ఢిల్లీ పరిణామాలపై ప్రధానంగా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ విచారణ, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు తదితర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.