జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనకాపల్లిలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకువచ్చేదని, కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ జనసేన పార్టీ నిజంగా త్యాగం చేసిందని, ప్రజలందరి అభిమానం తమకే లభించాలని ప్రతి పార్టీకి ఓ స్వార్థం ఉంటుందని, అయితే జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుండాలని సీట్ల సర్దుబాటుకు ముందుకు వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాయని వివరించారు. రాజకీయ పార్టీని నడపడం అంటే సులభమేమీ కాదని అన్నారు. మంత్రి పదవి మాత్రమే కోరుకుంటే, తనకు ఆ పదవి ఎప్పుడో లభించి ఉండేదని, కానీ తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని పవన్ కళ్యాణ్ అన్నారు అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ, బీజేపీ అధిష్ఠానం అభ్యర్థన మేరకు సీఎం రమేశ్ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని తెలిపారు. ఇక “అమ్మ ఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేలు ఇస్తామని మాటిచ్చారని , రెండో సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ 1000 తగ్గించి 14 వేలు, మూడో సంవత్సరం వచ్చే సరికి ఇంకో 1000 తగ్గించి 13 వేలు చేశారన్నారు . 2021-22లో మొత్తానికి అమ్మఒడి ఇవ్వకుండా ఎగ్గొట్టారని పవన్ మండిపడ్డారు . ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క బిడ్డకే అమ్మ ఒడి ఇస్తామని అన్నారు. 89 లక్షల మంది లబ్దిదారులు ఉంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చారన్నారు . జగన్ ముఖ్యమంత్రి కాదని … ఓ సారా వ్యాపారి అని దుయ్యబట్టారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మీ ముందుకు వచ్చానని , ఏపీ ప్రభుత్వ మాజీ ఉద్యోగి కొడుకుగా ఇవాళ చెబుతున్నా… మీ పెన్షన్ పథకాన్ని మీకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని, తాను ఎప్పుడూ మీకు అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు .