అమలాపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి-ప్రజాగళం సభలో జనసేనాని పవన్ ప్రసంగించారు. అమలాపురం వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందని అన్నారు. అమలాపురం ప్రజలు అంతటి ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తారని చెప్పారు. కోనసీమ, అమలాపురం ప్రాంతాల్లో చిచ్చుపెట్టాలని చూస్తే తాను చూస్తూ ఉండనని హెచ్చరించారు. 

“ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమే. జనసేన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులందరికీ ఇక్కడి క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా… నేను నాయకులెవరినీ వదులుకోను. జనసేన నేతలను గుండెల్లో పెట్టుకుంటాను. కానీ నన్ను వదిలి వెళ్లిపోతే నేనేం చేయలేను. నాయకులు వస్తారు, వెళ్లిపోతారు… జనసేన, జనసైనికులు, వీరమహిళలు, జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం, ప్రజా క్షేమం కోసం నిలబడతారు.