అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక అని చెప్పారు. ఈ పర్వదినం సందర్భంగా తన తరపున, జనసేన శ్రేణుల తరపున అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.  ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకుంటున్న మనం.. మన కళ్లెదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మన సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండటం శ్రేయస్కరం కాదని పవన్ అన్నారు. ఏపీలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెపుతున్న అధికారిక గణాంకాలు గుండెలను పిండేస్తున్నాయని చెప్పారు. ఈ అదృశ్యాల గురించి ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే మన ఆడబిడ్డల గతేంటని ప్రశ్నించారు. వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినేవారు ఎవరని అడిగారు. ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్ అని.. ఆ రోజు రావాలని ఆశపడుతున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మహిళలు అందరికీ ఈ శ్రావణ పౌర్ణమి శుభాలు కలగజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. 

Previous articleఅర్చకులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Next articleమేమంతా కలిశాం… I.N.D.I.A. కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదు: రాహుల్ గాంధీ