వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన తమ పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు జనసేనాని పవన్ రూ.55 లక్షల ఆర్థికసాయం అందించారు. కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 11 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు. 

ఆయా కార్యకర్తల మృతికి దారితీసిన కారణాలు తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. జనసేన అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఆలోచనతోనే పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా చేయించామని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. జనసేన పార్టీ ఒక కుటుంబం వంటిదని, ఆ కుటుంబంలో తాను కూడా సభ్యుడినే అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.