ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న ఆయన… సమావేశం తర్వాత కీలక ప్రకటన చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఈరోజు ఆయన ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ తో భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి మురళీధరన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అల్పాహార సమావేశాన్ని నిర్వహించారు. 15 నిమిషాల పాటు ఇరువురూ రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తన ఢిల్లీ పర్యటనలో పవన్ మరికొందరు బీజేపీ నేతలను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు త్వరలోనే పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈరోజు తెలిపారు.