రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకు రావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, వైసీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

మన ఓటే మన భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. వైసీపీ నిరంకుశత్వ పాలన పోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ, యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు-జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో యువతరం ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. 

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు, సంపద పెంపుతో మెరుగైన సంక్షేమం కావాలంటే… తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని నారా లోకేశ్ కోరారు. ప్రతి జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ టీడీపీకే సాధ్యమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు కానున్న ప్రజా ప్రభుత్వంలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.