పదవులు వస్తాయి పోతాయి… పదవులు శాశ్వతం కాదు… పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచ్‌లు విజయవంతంగా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ సర్పంచ్‌ల కృషి వల్లే తెలంగాణలోని ఎన్నో గ్రామాలకు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను ఇప్పించేందుకు ప్రతిపక్షంగా పోరాడుతామని చెప్పారు.

వేములవాడలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన కేటీఆర్….

వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్నమెంట్‌ను బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంఛార్జీ చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జీవితంలో, రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సహజమన్నారు. గోడకు కొట్టిన రబ్బర్ బంతి తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామన్నారు.