ఏపీ మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మా రోజా అవ్వ అంటూ ఆమెను సంబోధించిన కిరణ్… ‘ఏ ఆడపిల్లకైనా కష్టమొస్తే గన్ కంటే ముందు జగన్ వచ్చి శిక్షిస్తాడనే నమ్మకం కావాలి అధ్యక్షా’ అంటూ అసెంబ్లీలో ఆమె మాట్లాడిన ఆడియోను ఆయన ప్లే చేశారు. ఇప్పుడు గన్నూ లేదు, జగనూ లేడని కిరణ్ ఎద్దేవా చేశారు. రోజా అవ్వకి మాటలు తప్ప మ్యాటర్ లేదని ఎద్దేవా చేస్తూ, పోస్టర్ ను చూపించారు. ఆడపిల్లకు కష్టమొస్తే గన్ కంటే ముందు జగన్ వస్తాడని రోజా అవ్వ చెప్పిందని… భవ్యశ్రీ చనిపోయి ఇప్పటికి పది రోజులు అవుతోందని, గన్ రాలేదు, జగన్ రాలేదు, కనీసం నీవు కూడా రాలేదని విమర్శించారు. ఒక మహిళా మంత్రి అయ్యుండి, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా రాలేదని మండిపడ్డారు. అదే వైసీపీకి చెందిన ఎవరి కుటుంబంలోనైనా ఇలా జరిగి ఉంటే మా అవ్వ ఎంతో ఓవరాక్షన్ చేసేదని, ఇంత పెద్ద నోరు వేసుకుని పడిపోయేదని అన్నారు. నగరికి 30 కిలోమీటర్ల దూరంలో దారుణం జరిగితే ఇంత వరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలన్నా, బీసీలన్నా చిన్న చూపా? అని నిలదీశారు. భవ్యశ్రీ మృతి పట్ల నిజనిజాలను నిగ్గు తేల్చాలని, ఆమె మృతికి కారకులైన వారి వివరాలను బయటపెట్టి శిక్షించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.