జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగస్వామి అని, ఆయన బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిగా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు మెడికల్ కాలేజీల కోసం కనీసం దరఖాస్తు చేయటం చేతకాలేదని, కానీ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. మెడికల్ కాలేజీలపై కేసీఆర్‌కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రధానితో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనని దరిద్రపు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సీఎంగా కొనసాగితే రాష్ట్రానికి అరిష్టమన్నారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. సైన్స్ సిటీ అంటే ఏమిటో తెలియకుండానే హరీశ్ రావు మాట్లాడుతున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను తాము రాగానే వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తుందన్నారు. తాను తన మంత్రిత్వశాఖలో పని నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నానన్నారు. అయోధ్యలో హిందూ, ముస్లిం మధ్య ఘర్షణ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.