దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తీహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా జూన్ 1 వ తేదీవరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. జూన్ 2 వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.. మధ్యంతర బెయిల్‌ పొడగింపు అంశంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించకపోవడంతో ఆయన బెయిల్ గడువు ముగిసిన వెంటనే తీహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడగింపు పిటిషన్‌ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించగా.. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టు వెళ్లేందుకు కేజ్రీవాల్‌కు స్వేచ్ఛ ఉందని సూచించింది. అందుకే ఈ మధ్యంతర బెయిల్ పొడగింపు పిటిషన్ విచారణకు అర్హమైంది కాదని వెల్లడించింది. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్.. ట్రయల్ కోర్టును ఆశ్రయింవచ్చని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది